ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాపిశెట్టి లక్ష్మణ రచించిన “వెలుగు తోరణాలు” కవిత నర్సుల సేవా తపన, త్యాగం, మానవత్వానికి అక్షర రూపంగా నిలిచింది. ప్రాణాలకు ముప్పు ఉన్న అంటువ్యాధుల సమయంలో కూడా ధైర్యంగా విధులు నిర్వర్తించే నర్సులను కవి ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.
“ధవళ వస్త్రాలతో ధైర్యంగా సేవలందించే చల్లని తల్లులు”, “అశ్విని దేవతల దూతలు” అంటూ నర్సుల సేవా భావాన్ని ప్రశంసించిన కవి, వారి ఓర్పు, కరుణ, అంకితభావాన్ని పదేపదే గుర్తుచేశారు. రోగుల ప్రాణాల కోసం చావుతో పోరాడుతూ, మానసికంగా కుంగిపోయిన బాధితులకు అండగా నిలిచే నర్సులను నిజమైన వీరనారులుగా చిత్రించారు.
కుటుంబాలకు దూరంగా ఉంటూ, తమ పిల్లలను కూడా వదిలి విధుల్లో నిమగ్నమయ్యే నర్సుల మనోవేదనను “నిలువెత్తు కన్నీటి శిల”గా పోల్చడం కవితలో ప్రత్యేక భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అమ్మతనాన్ని బాధ్యతల దారాలుగా పేనుకుంటూ వృత్తిధర్మాన్నే జీవిత రాగంగా మార్చుకున్న నర్సుల సేవలను కవి గౌరవంగా కీర్తించారు.
“దేశం గుమ్మానికి వెలుగు తోరణాలు కడుతున్న నైటింగేల్ వారసులు” అనే పంక్తులు నర్సుల సమాజ సేవకు ప్రతీకగా నిలుస్తాయి. మదర్ తెరీసా స్ఫూర్తిని గుర్తుచేసే ఈ కవిత నర్సుల పట్ల సమాజ గౌరవాన్ని మరింత పెంచే భావోద్వేగ రచనగా నిలిచింది.