ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నకిలీ వైద్యులు, అనధికార వైద్య సేవలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా మే 12, 2026న నాగర్‌కర్నూల్ పట్టణం, బిజినేపల్లి గ్రామం, వనపర్తి జిల్లా బుద్ధరం గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలను డాక్టర్ కిరణ్ కుమార్ తోటవార్, డాక్టర్ సన్నీ డేవిస్ అయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. తనిఖీల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న పలు క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు వెలుగులోకి వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సుశ్మిత హెల్త్ క్లినిక్, రహీమ్ క్లినిక్, శ్రీ సాయి క్లినిక్, రోహిణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రీ దుర్గా క్లినిక్, లక్ష్మి క్లినిక్, అభిరామ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాఘవేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తదితర కేంద్రాలు అనధికారంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
అనధికార వైద్య సేవలు ప్రజారోగ్యానికి, రోగుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. తెలంగాణ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం (TMPR Act), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చట్టంలోని సెక్షన్లు 34, 54 ప్రకారం నకిలీ వైద్యులు, అనధికార వైద్య సేవలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తనిఖీ నివేదికలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (DMHO), పోలీస్ శాఖ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యుల నిర్మూలన, నైతిక వైద్య విధానాల పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత కోసం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కట్టుబడి పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు.