- ఆయన భావజాలం ఏమిటి?
- ఎంతోమంది బీజేపీ నేతలను చంపినవారిలో గద్దర్ ఒకరు
- పోలీసులు, బీజేపీ కార్యకర్తలను చంపిన వారికి పద్మ అవార్డులు ఇస్తామా?
- రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు
- కేంద్రం తెలంగాణకు సహకరిస్తున్నది
- ఏ పేరు పడితే ఆ పేరు సిఫార్సు చేస్తే ఇవ్వరు
- కేంద్రమంత్రి బండి సంజయ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు పద్మ పురుస్కారాన్ని ఎట్లా ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డు ఇవ్వబోమని, ఆయనకు ఏ భావజాలం ఉందని అవార్డులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలు ఏ పేరు పడితే ఆ పేరు పంపింతే అవార్డులు ఇవ్వరన్నారు. కేవలం అర్హులకు మాత్రమే అవార్దులు వరిస్తాయన్నారు. వందలమంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తే, నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో, ఎవరు బలైపోయారో ప్రజలకు అర్ధమైందన్నారు. పద్మ అవార్డుల విషయంలో చూపిన వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణ నుంచి డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారాలు దక్కగా.. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని సంజయ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. సంక్షేమ పథకాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం మార్చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి? అని ఆయన ప్రశ్నించారు.