కరీంనగర్,ముద్ర;
ఇక గల్లీ రోడ్లపై దృష్టి పెడుతున్నాం
అతి త్వరలో గల్లీగల్లీలో గుంతలు పడ్డ రోడ్ల స్థానంలో నూతన రోడ్ల పనులు ప్రారంభిస్తాం
కరీంనగర్ చెరువులను మినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం
మురుగు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి కరీంనగర్ చెరువుల సుందరీకరణ పనులకు శంకుస్థాపన
మూడు చెరువుల పునరుజ్జీవానికి రూ.5.82 కోట్లు విడుదల
పనులు పూర్తయితే అందంగా మారనున్న చెరువులు
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తే కరీంనగర్ లో అభివ్రుద్ధిని అడ్డుకునే నాథుడే ఉండబోరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ఇకపై గల్లీ గల్లీలో గుంతలు పడ్డ రోడ్లపై ద్రుష్టి సారించామన్నారు. అతి త్వరలోనే గల్లీల్లో నూతన రోడ్లను నిర్మిస్తామని వెల్లడించారు. కరీంనగర్ లోని కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, రేకుర్తి చెరువులను అమ్రుత్ నిధులతో పునరుద్దరించి మినీ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పలువురు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుద్దరణ పనులకు కేంద్ర మంత్రి బండి సజయ్ శంకుస్థాపన చేశారు. ఆయా చెరువుల చుట్టూ అధికారులు, మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి కలియ తిరిగారు. అమ్రుత్ 2 కింద విడుదలైన కేంద్ర నిధులతో చేపట్టబోయే పనులపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…
కరీంనగర్ కార్పొరేషన్ లో అభివ్రుద్ధి పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమ్రుత్ 2 నిధులతో తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల పునరుజ్జీవం కోసం రూ.5.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అందులో భాగంగా ఈరోజు తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేశాం.
వినాయక నిమజ్జనం, బతుకమ్మ నిమజ్జనం సమయంలో భక్తులు ఇబ్బంది పడేవాళ్లు. ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా చెరువులను పునరుద్దరిస్తున్నాం. చెరువు చుట్టూ బండ్ నిర్మించడంతోపాటు అందంగా తీర్చిదిద్దుతాం. కరీంనగర్ ప్రజలంతా కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా చెరువులను అందంగా తీర్చిదిద్ది మినీ పర్యాటక ప్రాంతంగా మారుస్తాం.
అభివ్రుద్దిలో కరీంనగర్ దూసుకుపోతోంది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత కార్పొరేషన్ పాలకవర్గమంతా రాజకీయాలకు అతీతంగా గల్లీలో ఉన్న రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా పని చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇదే విధంగా పార్టీలకు, రాజకీయాలు అతీతంగా కలిసి కట్టుగా పనిచేస్తే కరీంనగర్ అభివ్రుద్దిని ఆపే నాథుడే ఉండరు. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాం. రాష్ట్రం నుండి నిధులు రాబడతాం. తిరుగులేని అభివ్రుద్ధి సాధిస్తాం. అభివ్రుద్దిలో కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.