ముద్ర ప్రతినిధి,మెదక్:
జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ఈ విషయంలో
తహసిల్దారులకు చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీ, ఇతర రెవెన్యూ సమస్యలపై గూగుల్ మీట్ నిర్వహించారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..
రెవెన్యూ శాఖలో పారదర్శకత పాలన కోసం అధికారులందరూ పాటుపడాలన్నారు.
ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలకు వెనకాడబోమని తహసీల్దార్లను హెచ్చరించారు. మండలాల వారీగా భూభారతి, ప్రజావాణి ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు.
ఓటర్ జాబితా తయారీ అన్ని శాఖల సమన్వయం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సొంత నిర్ణయాలకు తావు లేదన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి నివారణకు మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్, గ్రిడ్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, వివిధ శాఖల అధికారులతో వేసవికాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుపై సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలో గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి సమస్యను తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో జిల్లాలోని 917 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,76,170 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న 1485 తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని తెలిపారు. తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పకడ్బందీగా పర్యవేక్షణ జరగాలని సూచించారు. బోర్ వెల్స్ మరమ్మతులు, ట్యాంకుల క్లీనింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు శ్రీనివాసరావు, జోజి, యాదయ్య, మిషన్ సంపత్ కుమార్, నాగభూషణం, మున్సిపల్ కమిషనర్స్, గ్రౌండ్ వాటర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.