Take a fresh look at your lifestyle.

బ్యారేజ్ మరమ్మత్తు వేగవంతానికి చర్యలు పరిశీలించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్

 

మహదేవపూర్, ముద్ర:

కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజి,–అన్నారం సరస్వతి బ్యారేజీలను శుక్రవారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేడిగడ్డ లో కొనసాగుతున్న బోర్ హోల్స్ పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారి శ్రీధర్ అధికారులను అడిగితెలుసుకున్నారు. మేడిగడ్డ,అన్నారం ప్రాజెక్ట్ ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి సిబ్బంది ఉండేందుకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కొరకు గదులను పరిశీలించారు.అన్నారం ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టులో సాంకేతిక పరిశీలన పనులను శుక్రవారం నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశల వారీగా చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. డ్రిల్లింగ్ పనులు చేపట్టేటప్పుడు గట్టి శిలా పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టులో వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజు ఇరిగేషన్ అధికారులు పనులను ఇలాంటి నిర్లక్ష్యం లేకుండా సమగ్రంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సి రమేష్ కుమార్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈలు తిరుపతిరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.