ఘనంగా ప్రారంభమైన నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారుల భాగస్వామ్యం
ముద్ర, శేరిలింగంపల్లి:
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026‘ శుక్రవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ క్రీడా జ్యోతిని అందించగా, డీజీపీ దానిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని క్రీడాకారులు, అధికారులు కలిసి ఆలపించగా మైదానమంతా రాష్ట్ర స్ఫూర్తితో మారుమోగింది. పోలీస్ లాంఛనాల మధ్య డీజీపీ గన్ ఫైర్ చేసి, గాలిలోకి బెలూన్లు ఎగురవేసి పోటీలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా డీజీపీ డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ. ఇటీవల రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల బందోబస్తు మరియు సమ్మక్క-సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు అత్యంత నిబద్ధతతో నిర్వహించారని కొనియాడారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టి లేపడం తో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పథకాలు సాధించడం కంటే కూడా మంచి స్నేహితులను సాధించడం గొప్ప అన్నారు. మహిళా పోలీసుల ప్రాతినిధ్యం ప్రతి విభాగంలోనూ పెరగాలని, ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలను చాటుకోవాలని సూచించారు. గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి, ఐక్యత మరియు పరస్పర గౌరవం ముఖ్యమని, ఇదే స్ఫూర్తిని వృత్తిలోనూ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణమని, ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండటం విశేషమన్నారు. వచ్చే నెల సైబరాబాద్ వేదికగా జరగనున్న “అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం వహిస్తునాదన్నారు. క్రీడాకారులకు వసతులు కల్పించిన టీజీపీఏ అధికారులకు, మైదానాలు సమకూర్చిన సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని, మహిళలకు 14 ఈవెంట్స్ కేటాయించామని తెలిపారు. జాతీయ స్థాయి విజేతలకు గోల్డ్ మెడల్‌కు రూ. 3 లక్షలు, సిల్వర్‌కు రూ. 2 లక్షలు, బ్రాంజ్‌కు రూ. 1 లక్ష నగదుతో పాటు ఇంక్రిమెంట్లు అందజేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి గారికి క్రీడలపై ఉన్న మక్కువతో మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ వంటి వారిని నేరుగా డీఎస్పీలుగా నియమించడం శాఖకు గర్వకారణమన్నారు.
పలువురికి సన్మానం
స్పోర్ట్స్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్ మాట్లాడిన అనంతరం అంతర్జాతీయ వేదికలపై రాణించిన పి. కృష్ణారావు, డి. సంజీవ్ కుమార్, గోపాల్ కృష్ణ, ఎం.డి. బాబా, అవెను గోపాల్, ఎస్. జయరాం (అర్జున అవార్డు గ్రహీత), కె. లావణ్యలను పతకాలతో సన్మానించారు. ఈ మీట్‌లో జోగులాంబ, చార్మినార్, యాదాద్రి, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కాళేశ్వరం జోన్లు, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, మల్కాజిగిరి కమిషనరేట్లు, TGSP-I, TGSP-II, ఈగిల్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ & కమ్యూనికేషన్, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు TGPA విభాగాలు పాల్గొన్నాయన్నారు. అనంతరం డీజీపీ గారు వాలీబాల్ మ్యాచ్‌ను వీక్షించి, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.
ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ ఎక్స్ పో..
ఈ క్రీడా పోటీలను పురస్కరించుకొని పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ లో భాగంగా సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సతీమణి శ్రీమతి హేమ శివధర్ రెడ్డి ప్రారంభించారు.
వ్యాయామానికి సంబంధించి డెకత్లాన్ సంస్థ వ్యాయామం, క్రీడా పరికరాలు, సైకిళ్లు ప్రదర్శించారు.
ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రి స్టాల్, కళ్ల కు సంబంధించిన స్టాల్, తెలంగాణ సంప్రదాయ పిండి వంటకాల స్టాల్ కొలువుదీరాయి. చిన్నారుల కోసం వివిధ ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఈ శనివారం వరకూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ – జైళ్లు మరియు కరెక్షన్స్ సర్వీసెస్; విక్రమ్ సింగ్ మాన్, డిజి అగ్నిమాపక శాఖ; మహేశ్ మురళీధర్ భగవత్, ఏడిజిపి లా అండ్ ఆర్డర్; డాక్టర్ అనిల్ కుమార్, ఏడిజిపి ఆపరేషన్స్ గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్; విజయ్ కుమార్, ఏడిజిపి ఇంటెలిజెన్స్; వీబీ కమలాసన్ రెడ్డి, ఓఎస్డీ, ఐఎస్ డబ్ల్యూ; డాక్టర్ గజరావు భూపాల్, పీ& ఎల్, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీ; ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐజీ మల్టీ జోన్ – I; సుమతి, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ; ఆవుల రమేశ్ రెడ్డి, త్రిపుర ఐజీ; సైబరాబాద్ డిసిపిలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.