- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పై సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో చేపట్టిన 7 తహసిల్దార్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని, రాబోయే జనవరి 1,2026 నాటికి నూతన తహసిల్దార్ కార్యాలయాల ప్రారంభోత్సవం కావాలని అన్నారు.మంథని పట్టణంలో రూ.4.5 కోట్లతో చేపట్టిన సమీకృత కార్యాలయాల సముదాయం పనులను రాబోయే ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మతు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మతు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల, హస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ సమ్మర్ సీజన్ పూర్తయ్యే లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, డి.ఆర్.డి.ఓ. కాలిందిని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.