Take a fresh look at your lifestyle.

సింగరేణి కావాలి.. ఉద్యోగాల గని

  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.
  • జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పత్రాల అందజేత.
  • సింగరేణి ఉజ్వల భవిష్యత్కు శ్రమతో కూడిన అడుగులు పడాలి.
  • సింగరేణి కారుణ్య ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంపు లబ్ధిదారులకు.
  • ఉద్యోగ పత్రాల అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : 13 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ ఇక ముందు కూడా అభివృద్ధి పథంలో ముందుకుసాగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.కేవలం బొగ్గు గని గానే కాకుండా వేల మందికి ఉపాధి చూపే ఉద్యోగాల గనిగా రూపుదిద్దుకోవాలని సూచించారు.ఆ దిశగా కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మన ముందు తరాల వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బలమైన సింగరేణి సంస్థను మనకు అందించారన్న భట్టి.. మనం కూడా మన వారసులకు ఉజ్వల సింగరేణిని అందించకపోతే భావి తరాలకు తీరని నష్టం చేసిన వాళ్లం అవుతామన్నారు. సింగరేణి అభివృద్ధిలో కింది ఉద్యోగి నుంచి సీఎండీ వరకు అందరికీ సమాన బాధ్యత ఉంటుందనీ సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు.ఉద్యోగులకు కష్టంగా ఉంటుందని ఉదాసీనంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందుల పాలవుతామని హెచ్చరించారు.నిబంధనలతో, శ్రమతో కూడిన అడుగులు వేయాలన్నారు.మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధి పొందిన వారసులకు ఆయన ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కారుణ్య ఉద్యోగాలలో గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏండ్లకు పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాలు కోరిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి అంగీకరించామని చెప్పారు.దాంతో 35 సంవత్సరాల వయో పరిమితి దాటిన అనేక వందల మందికి ఉద్యోగాలు లభించే అదృష్టం దక్కిందన్నారు.నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి సంస్థ మార్కెట్లో ఇతరులతో పోటీపడి నిలవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క ఆభిప్రాయపడ్డారు. అందుకు సింగరేణి కార్మికులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ పూర్తి పనిగంటలు పనిచేస్తూ కంపెనీని కాపాడుకోవాలన్నారు.భవిష్యత్తు తరాలకు దీనిని ఒక వారసత్వంగా అందించాలన్నారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి కూడా విస్తరిస్తున్నామని, ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే ప్రతీ ఒక్కరూ శ్రమ శక్తిని చాటాలన్నారు.కొత్తగా ఉద్యోగంలో చేరిన సింగరేణి వారసులు తేలికపాటి ఉద్యోగం కోసం విఫల ప్రయత్నాలు చేయకుండా, ఇచ్చిన పనిని సమర్థంగా నిర్వహిస్తూ కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా వయోపరిమితి సడలింపుకు అంగీకరించి, అనేక కుటుంబాల్లో వెలుగు నింపిందని చెప్పారు.ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం కు కృతజ్ఙతలు తెలిపారు. గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ మాట్లాడుతూ వయో పరిమితిని 35 నుంచి 40 ఏండ్లకు పెంచడం ఒక సంచలనాత్మక నిర్ణయం అన్నారు.ఉద్యోగంలో చేరిన యువత కష్టపడి పనిచేస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గైర్హాజరీలకు పాల్పడవద్దని సూచించారు. ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం ఛైర్మన్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశం లో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి సహకరిస్తుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5వేల బోనస్ చెల్లించిందన్నారు. దేశంలో ఏ బొగ్గు సంస్థల్లో లేని విధంగా సింగరేణిలో వయో పరిమితిని 40 ఏళ్ల కు పెంచడం కూడా ఇక్కడే సాధ్యమైంది అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (పి అండ్ పి, పర్సనల్)కె.వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవిత నాయుడు పాల్గొన్నారు.

  • జూన్​ 2న రాజీవ్​ యువవికాసం ఫలాలు.

తమ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రూ.9 వేల కోట్లతో చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినం జూన్ 2వ తేదీన పత్రాలను అందజేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.దీన్ని లక్షల మందికి ఉపాధి లభించే బృహత్ పథకంగా అమలు చేయనున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.