Take a fresh look at your lifestyle.

స్వర్ణమయం కానున్న యాదాద్రి ప్రధాన ఆలయ రాజగోపురం

  • వైభవోపేతంగా సంప్రోక్షణ కార్యక్రమాలు
  • మహాకుంభాభిషేక సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ప్రధాన ఆలయ రాజగోపురం ఇక స్వర్ణమయం కానుంది.దీనికి సంబంధించిన పూర్తి కసరత్తును పూర్తి చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దివ్య విమాన గోపురానికి బంగారం తాపడం పనులు పూర్తయ్యాయని,ఈనెల 23న శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.19 నుండి 23 వరకు ఐదు రోజులపాటు యజ్ఞ యాగాదులు నిర్వహింపబడతాయని చివరి రోజు అనగా 23వ తేదీ ఉదయం 11:54 నిమిషాలకు మూల నక్షత్ర యుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున స్వామి వారి దివ్య విమాన గోపురానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు.

ఈ విమాన గోపురానికి సంబంధించి మొత్తం 65.084 కిలోల బంగారాన్ని వినియోగించామని ఇందులో విరాళాల ద్వారా 10,500 గ్రాములు.దేవస్థానం గోల్డ్ బాండ్ల ద్వారా 3,120 కిలోలు.దేవస్థానం హుండీలలో వేసిన మిశ్రమ బంగారం 12,701 కిలోలు.వెండిని బంగారంగా మార్చడం ద్వారా 8,600 కిలోలు.మరియు 30,051 కిలోల బంగారాన్ని కొనడం ద్వారా 65 కిలోల బంగారాన్ని సమకూర్చినట్లు తెలిపారు.ఇది మొత్తం 10753 చదరపు అడుగుల రాజగోపురం కాగా, ప్రతి చదరపు అడుగుకు 6 గ్రాముల బంగారం ఉపయోగించినట్లు తెలిపారు.అంతేకాక వచ్చే 50 ఏళ్లు మన్నికతో ఉంటుందని, ఐదంతస్తులతో కూడిన ఆలయాన్ని పంచతల గోపురం అని కూడా పిలుస్తారని తెలిపారు.50.5 అడుగులు ఎత్తులో ఉండి దేశంలోనే బంగారు తాపడం గల ఏకైక గోపురంగా నిలువనుందని అన్నారు. బంగారు తాపడానికి ఇచ్చిన దాతలను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానం అందించామని అన్నారు.19 నుండి 23 వరకు మహా కుంభాభిషేక కార్యక్రమాలు ఉన్నందున ఆలయంలో జరిగే సుదర్శన హోమం,పుష్పార్చన,నిత్య కళ్యాణాలు,సువర్ణ పుష్పార్చన వంటివి రద్దు చేయనున్నట్లు తెలిపారు.ఈ కుంభాభిషేక కార్యక్రమానికి సుమారుగా లక్ష మంది భక్తులు హాజరుకానున్నట్లు అంచనా వేశారు.ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఈవో భాస్కరరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.