- 19,775 మొక్కలు నాటిన సింగరేణి సిఎండి.
యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా, సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలో సోమవారం 204 పండ్ల మొక్కలు నాటారు. వీటితో కలిపి, నేటి వరకు ఆయన ఒక్కరే మొత్తం 19,775 మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు దిక్సూచిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు. ఆయన 2019 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు 108 మొక్కలు నాటి అప్పటినుండి, తాను ఒక్కరే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మొక్కలు నాటుతూ వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటే కార్యక్రమంలో ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యులను చేయాలని, పర్యావరణం పట్ల గల అభిమానంతోనే తాను మొక్కలు నాటుతూ వస్తున్నానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ సంస్థల బాధ్యతగా భావించ కూడదని, ప్రతి ఒక్కరు తమ వంతుగా కనీసం మూడు మొక్కలు నాటాలని సూచించారు. పండ్ల మొక్కలను పెంచడానికి ఎవరైనా ముందుకొస్తే వాటిని సింగరేణి సంస్థ ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సమీప గ్రామాలలో 2 కోట్ల 29 లక్షల పండ్ల మొక్కల్ని ప్రజలకు పంపిణీ చేశామని, సమీప గ్రామాల్లో ప్రజలు వీటిని పెంచుతూ ఫలాలను పొందుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికి ఐదు కోట్ల 47 లక్షల మొక్కలను 15,231 హెక్టార్లలో నాటి, వాటిని వనాలుగా పెంచుతుందన్నారు. భావితరాల వారికి మనం ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని, మొక్కలు పెంచితే అవి వారికి ఆస్తులు కన్నా గొప్పదైన పచ్చని వాతావరణం అందిస్తుందన్నారు. ఇక ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎండి బలరాం వెంట సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ డి. సత్యనారాయణ రావు, ఎల్.వి. సూర్యనారాయణ, కే. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్లు ఏ.మనోహర్, బి.సైదులు. ఇంకా వివిధ విభాగాల జీఎం లు ఎన్.రాధాకృష్ణ, ఏ.రవికుమార్, పి.ఎలీషా, డి.శ్రీనివాసరావు, జీవి. కిరణ్ కుమార్, సిహెచ్. లక్ష్మీనారాయణ, డి.వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు పాల్గొన్నారు.
