మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు -కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిర్మల్ లోని 38 వ వార్డులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు.అలాగే కేజిబీవీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి వసతి, తదితర సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన మౌళిక వసతులను కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వేసవికాలం ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరమైన చోట డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తూ, అవసరమైన వాటికి మరమ్మతులు చేయాలన్నారు. అంతకు ముందు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఉదయపు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు.మెస్ నిర్వహణను పరిశీలించి, విద్యార్థులకు వడ్డిస్తున్న అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ రాజు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.