ఇండ్ల మంజూరి నీ పార్టీలకు అతీతంగా చేయాలి,రేషన్ దుకాణాల్లో సీఎం ఫోటో తో పాటు ప్రధాన మంత్రి ఫోటో ఉండాల్సిందే– పాలమూరు ఎంపీ డీకే అరుణ
-కోటకొండ – కోయిల కొండ మధ్య రోడ్డు పనులు ఎందుకు నిలిచిపోయాయి?
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ముద్ర, నారాయణపేట:
ఇండ్ల మంజూరి నీ పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని…రేషన్ దుకాణాల్లో సీఎం ఫోటో తో పాటు ప్రధాన మంత్రి ఫోటో ఉండాల్సిందేనని పాలమూరు ఎంపీ డీకే అరుణ ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది,సమన్వయ మరియు పర్య వేక్షణ కమిటీ (దిశ) మూడవ సమావేశం పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీ.కే. అరుణ అధ్యక్షతన నిర్వహించగా ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటకొండ – కోయిల కొండ మధ్య రోడ్డు పనులు ఎందుకు నిలిచిపోయాయనీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 45 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర ,రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎంపీ డీకే అరుణ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు అవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా క్షేత్ర స్థాయిలో సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు,రాష్ట్ర వాటా నిధులతో అమలు చేస్తున్న కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. పథకాలు,కార్యక్రమాల అమలులో లోపాలు ఉంటే సవరించుకొని ఎవరికి చేరాలో వారికి లబ్ధి జరిగినప్పుడు లక్ష్యం నెరవేరుతుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి జిల్లాలో 272 గ్రామ పంచాయతీలకు గాను 201 గ్రామాల్లో సొంత పంచాయతీ కార్యాలయ భవనాలున్నాయని, మిగతా 71 పంచాయతీలకు సొంత భవనాలు లేవని తెలిపారు. స్పందించిన ఎంపీ అరుణ ఇప్పటికీ సొంత పంచాయతీ కార్యాలయ భవనాలు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో చాలా మంది సర్పంచులు చేసిన పనులకు నేటికి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో వైద్యులు ఉన్నారా లేదా అని ఎంపీ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కేంద్రం వాటా గురించి తెలిపిన ఎంపీ అరుణ ఇండ్ల మంజూరి నీ పార్టీలకు అతీతంగా చేయాలని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ శాఖకు నిధులు మంజూరైనా.. ఎలాంటి అభివృధి కార్యక్రమాల శంకుస్థాపన/ ప్రారంభోత్సవాలు ఉన్నా ఖచ్చితంగా తన సమయం తీసుకుని చేయాలని ఎంపీ అరుణ ఆదేశించారు. ధన్వాడ లో డిగ్రీ కళాశాల భూమిపూజ ఎవరిని అడిగి చేశారని ఎంపీ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అసలు డిగ్రీ కళాశాల నిర్మించాల్సిన స్థలం ఆక్రమణ కు గురైందని, తక్కువ స్థలంలో కళాశాల కట్టాలని చూస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఒకరిద్దరి సంతోషం కోసం కాలేజీ కట్టడం తప్పు అని ఆమె హితవు పలికారు. జిల్లాలో ఎన్.హెచ్. విస్తరణ కు ఏమైనా ప్రతిపాదన లు ఉన్నాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. బ్యాంకర్లు రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, మిగతా టార్గెట్ లను పూర్తి చేయాలని ఎల్.డి ఎం కు ఆమె సూచించారు. ఉట్కూర్, మక్తల్ ప్రాంతాల్లో పంట పొలాల్లో జింకల సంచారం అధికంగా ఉందని సమస్య కు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆమె సూచించారు. కలెక్టర్ సీహెచ్. ప్రియాంక మాట్లాడుతూ…దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని,ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు చేపట్టే పనులు ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలని ఆదేశించారు.