Take a fresh look at your lifestyle.

రాచాలపల్లి గ్రామంలో రైతులతో కలెక్టర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముఖాముఖి

 

తేమ శాతం పరిశీలించి ధాన్యం తీసుకురావాలి – రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం రాచాలపల్లి గ్రామ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గ్రామంలో వరి ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులను కలిసి పంట దిగుబడి, ధాన్యం నాణ్యత, కొనుగోలు కేంద్రాలకు తరలింపు ఏర్పాట్లపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లే ముందు తప్పనిసరిగా తేమ శాతం సరిచూసుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత తేమ శాతం ఉన్న ధాన్యాన్నే వెంటనే కొనుగోలు చేస్తారని తెలిపారు. అలాగే ధాన్యంలో రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా ఉంచితే కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు.

ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుగుతుందని, ధాన్యం సేకరణ పూర్తైన తర్వాత 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకురావాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయం, పీడీ హౌసింగ్ సంగప్ప, డీపీవో శ్రీరాములు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, ఉరుకొండ తహసీల్దార్ యూసుఫ్ అలీ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.