కోహిర్ దిగ్వాల్ సబ్‌స్టేషన్ తనిఖీ – రైతులకు 12 గంటలే కరెంట్ వస్తోందని ఆరోపణ
ముద్ర, మెదక్ :
రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్ధమని, వాస్తవానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే అందుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. గురువారం కోహిర్ మండలంలోని దిగ్వాల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి లాగ్‌బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అబద్దలాడుతున్నారని చెప్పారు. లాగ్‌బుక్‌లను పరిశీలిస్తే కేవలం 13 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే నమోదైందన్నారు. అందులో కూడా ఎల్‌సి, లైన్ బ్రేక్, ట్రిప్పింగ్ వంటి సమస్యలు తీసేస్తే రైతులకు 12 గంటల కరెంట్ కూడా సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా కోహిర్ ప్రాంత రైతులు విద్యుత్ సరఫరా సరిగా లేదని తమకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని హరీశ్ రావు తెలిపారు. రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో పంటలకు నీరు అందడం లేదని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. దిగ్వాల్ సబ్‌స్టేషన్ లాగ్‌బుక్ ప్రకారం ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు త్రీఫేజ్ కరెంట్ నిలిపివేయగా, 11వ తేదీ ఉదయం 3 గంటలకు మాత్రమే మళ్లీ సరఫరా ప్రారంభమైందన్నారు. అంటే దాదాపు 11 గంటల పాటు కరెంట్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిందన్నారు. కానీ ప్రస్తుతం కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే అందుతున్నదని విమర్శించారు. రైతుబంధు, పంటల బీమా, బోనస్ వంటి పథకాలు కూడా అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ రూ.4,900కి ఇచ్చామని హరీశ్ రావు చెప్పారు. ప్రస్తుతం దాన్ని రూ.9,700కి పెంచారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే మార్పులు చేయడం లేదని విమర్శించారు. మూడో డిస్కం ఏర్పాటు చేసి అప్పులను మళ్లించే ప్రయత్నం జరుగుతుందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రస్తుతం డిస్కంలపై రూ.55 వేల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19,647 మంది ఆర్టీజెన్స్ ఆరు నెలలుగా సమ్మె చేస్తున్నారని, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చనిపోయిన ఆర్టీజెన్స్ కుటుంబ సభ్యులకు అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు విడుదల చేయడంతో పాటు డబ్బులు చెల్లించిన ఇండ్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతుబంధు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.