Take a fresh look at your lifestyle.

తెలంగాణలో క్రీడా స్ఫూర్తి తగ్గింది-ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లలో క్రీడాపోటీలు నిర్వహించకపోవడం దారుణం
లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారు
క్రీడలనూ రాజకీయ కోణంలో చూశారు
ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం
క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చాం
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్బీ స్టేడియం అభివృద్ధి
ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా గచ్చిబౌలి స్టేడియంలో సదుపాయాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఒకప్పుడు క్రీడల రాజధానిగా ఉండే తెలంగాణలో సుదీర్ఘకాలంగా క్రీడాపోటీలు నిర్వహించకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో క్రీడా స్ఫూర్తి తగ్గిందన్నారు. ప్రపంచ ఫుట్‌బాస్ దిగ్గజం లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారన్న ఆయన నగరాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడటం బాధాకరం అన్నారు. శనివారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసన సభ్యుల స్పోర్ట్స్ మీట్-2026 తొలి ఎడిషన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొని.. క్రీడలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, ఐటీ మాత్రమే కాదన్న సీఎం.. క్రీడలకు కూడా కేరాఫ్ అడ్రస్ అని ప్రపంచానికి చాటిచెప్పేందుకే మెస్సీని ఇక్కడ ఆహ్వానించామని చెప్పారు. కానీ కొందరు దీనిని తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నామని విమర్శించడం దురదృష్టకరం అన్నారు.


క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌ తీసుకొచ్చామన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు.

మెస్సీ ఇక్కడికి వస్తే.. హైదరాబాద్‌ ఖ్యాతి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. కోల్‌కతా వంటి నగరాల్లో మెస్సీ పర్యటన గందరగోళంగా ముగిసినా, హైదరాబాద్‌లో మాత్రం అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా నిర్వహించామని సీఎం గుర్తు చేశారు.

ఇది తెలంగాణ ఆతిథ్యానికి, సమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తమ కేబినెట్‌లో అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారన్నారు. వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం మరోసారి వచ్చిందని చెప్పారు. ఈ మైదానంలో శిక్షణ పొందిన రాష్ట్ర మంత్రి అజారొద్దీన్…క్రికెట్‌లో దేశానికి వన్నె తెచ్చారన్నారు.

రంజీ క్రికెట్‌ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడా స్ఫూర్తి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్‌ పోటీలను నిర్వహించామన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్న రేవంత్ రెడ్డి… చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైన ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఉపశమనంగా ఉపయోగపడతాయన్న రేవంత్ రెడ్డి.. వారంతా ఈ పోటీల్లోక్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశించారు. నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ, నిరంతరం సమస్యల పరిష్కారం కోసం విరామం లేకుండా పని చేసేవారికి ఇది అద్భుత అవకాశం అన్నారు.

 

ఇక్కడ అద్భుతంగా ఆడలేకపోవచ్చు గానీ, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అవుతుందన్నారు. ఈ పోటీలకు సీఎంతో పాటు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్‌ ఆడారు. కాగా లెమన్‌ అండ్‌ స్పూన్‌ పోటీలో మంత్రి కొండా సురేఖ మొదటి బహుమతి గెలుచుకోగా.. ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.