99 రోజుల్లో లక్ష్యాలను చేరుకోవాలి హౌసింగ్ బోర్డు పరిధిలోని 5వేల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
99 రోజుల ప్రజాపాలన- ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5వేల రిజిస్ట్రేషన్‌లను క్లియర్ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ఆయన శనివారం సచివాలయంలో ప్రారంభించారు. దీంతో పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్ నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. హౌసింగ్ బోర్డు పరిధిలో ఇండ్లు, ఫ్లాట్లు, స్ధలాలను వాయిదాల రూపంలో కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో కొంతమంది అసలు మరి కొంత మంది వడ్డీలు చెల్లించాలని, ఇంకొంతమంది వాయిదాల గడువు ముగిసిపోయిందన్నారు. ఈ విధంగా దాదాపు ఐదు వేల మంది తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉందని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఈ పోర్టల్ తో ప్రజలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదన్నారు. పూర్తి సమాచారం పోర్టల్ లోనే ఉంటుందన్నారు. కేటాయింపుదారులు తమ రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధృవీకరణ, ఇతర లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ విధానంతో పారదర్శకత పెరగడంతో పాటు పౌరులకు సేవలు మరింత చేరువవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ రమణారెడ్డి పాల్గొన్నారు.