ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు చేయాల్సి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ సమీపంలో ని బోయపల్లి వైటిసి భవనంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది పదవ తరగతి విద్యార్థులకు ఐఐఐటీ కళాశాలలో సీటు పొందడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 42 రోజులుగా కొనసాగుతున్న ఈ శిక్షణా కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మహబూబ్ నగర్ ఫస్ట్,వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను అవలంభించుకుని వాటిని సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. విజయాన్ని సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పట్టుదలతో చదవడం, లక్ష్యసాధన పట్ల నిబద్ధత కలిగి ఉండటం చాలా అవసరమన్నారు. విద్యార్థులు కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఏపిజె అబ్దుల్ కలామ్ స్మరించుకుంటూ ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో ఆయన ఎప్పుడూ చెప్పేవారన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తీరు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. వారిని చూసి ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలో అనే పుస్తకం అబ్దుల్ కలాం రాశారేమో అనిపిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే దేశ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్ నగర్‌లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ఒక మంచి ప్రయోగాన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐఐటీ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ అందించడం అభినందనీయమని తెలిపారు. భారతదేశానికి ఉత్తమ పౌరులను తయారు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండటం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు ఐఐఐటీలో అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతున్నాయని, వారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరనిన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. లక్ష్మీనారాయణ విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రేరణనిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం వారి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, రామకృష్ణ మఠం కోఆర్డినేటర్ రాజా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.