Take a fresh look at your lifestyle.

మావోయిస్టులు చర్చల ద్వారా లొంగిపోవడంతో తెలంగాణలో శాంతి సాధన

ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు
చర్చలే సమస్యల పరిష్కారానికి మార్గం
గణపతి సహా ఇతర మావోయిస్టులందరూ లొంగిపోవాలి
లొంగిపోయిన వారికి అండగా ఉంటాం
వారికి రక్షణతో పాటు ఆర్థిక, ఇతర సదుపాయాలు కల్పిస్తాం
ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తాం
నగదు ప్రోత్సాహకం పెంపుకూ కృషి చేస్తాం
కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చలు జరిపాం
మహాత్మగాంధీ అహింసా, శాంతిమార్గంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు
సీఎం సమక్షంలో 124 అత్యాధునిక ఆయుధాలతో 130 మంది లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేదని ప్రకటించిన సర్కార్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.. జనజీవన స్రవంతిలో కలవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం 130 మంది మావోయిస్టులు 124 అత్యాధునిక ఆయుధాలతో సహా సీఎం ముందు లొంగిపోయారు.

ఈ సందర్భంగా మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఆర్థిక, ఇతర వసతులను కల్పిస్తుందని వారిలో నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను సీఎం అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అహింసా, శాంతిమార్గం ప్రపంచంలో అత్యంత బలమైన ఆయుధాలని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ శాంతియుత పోరాటంతో ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని చెప్పారు. ఎంత పెద్ద సమస్యకైనా సరే చర్చలే పరిష్కార మార్గం అన్నారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్న పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉందన్నారు. శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది అని సీఎం వ్యాఖ్యానించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఈ విషయాన్ని గ్రహించి చర్చలకు ముందుకు రావాలన్నారు. గణపతితో సహా ఇతర మావోయిస్టులందరూ లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల సమస్యల పరిష్కారం, వారి ఉపాధి అవకాశాల బాధ్యత తనదన్నారు.

సమస్యల పరిష్కారం నా బాధ్యత
ఇటీవల లొంగిపోయిన కీలక నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి సహా ఇద్దరు ముగ్గురు కీలక నేతలతో సమావేశమై వారితో సుధీర్ఘంగా చర్చించినట్లు సీఎం తెలిపారు. వారు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చినట్లు వివరించారు. రాష్ట్ర పరిధిలోనే వారి డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. ఇదే అంశంపై ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో కూడా మాట్లాడాననీ ఆయుధాలతో లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించాలని అమిత్ షా ను కోరినట్లు చెప్పారు. లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టులకు నమ్మకం కల్పిస్తున్నామని సీఎం అన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా లొంగిపోలేదన్న సీఎం తమపై నమ్మకం పెట్టుకున్న మాజీ మావోయిస్టులందరినీ కాపాడుకునే బాధ్యత కూడా తమదేనన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామనీ నగదును కూడా పెంచేందుకు ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేదు : డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఇక లేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి సంబంధిచి మిగిలిన వారందరూ సరెండర్ అయ్యారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలు అప్పగించి లొంగిపోయారన్నారు. లొంగిపోయిన వారిలో 125 మంది మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వారున్నారన్నారు. తెలంగాణకు చెందిన వారు నలుగురు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒకరు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన వారు ముగ్గురు, డివిజనల్ కమిటీకి చెందిన10మంది, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 70 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ వివరించారు. తాజాగా లొంగిపోయినవారితో కలిపి ఇప్పటి వరకూ తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు. వీరిలో తెలంగాణ స్టేట్ కమిటీ నుంచి ఐదుగురు లొంగిపోవడంతో ఇక రాష్ట్ర కమిటీ చరిత్రలో మిగిలిపోనుందని డీజీపీ వివరించారు. దేశవ్యాప్తంగా తుపాకీ ద్వారానే మార్పు వస్తుందని తెలంగాణ నాయకుల నేతృత్వంలో పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేకుండా పోయిందని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు ఇతర కమిటీలన్నింటిలో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని వారు కూడా త్వరగా సరెండర్ కావాలని పిలుపునిచ్చారు.

ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదు:
లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారు ఒక ఇన్ సాస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21)ఇన్‍సాస్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందునా భూమి ఇవ్వడంపై హామీ ఇవ్వలేనన్నారు. రాష్ట్రంలో హింసకు తావులేదని అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదన్నారు.

మావోలకు ఆర్ధిక సాయం..
లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి అందించనున్నది. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత.. వారు జీవించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా రివార్డు అందిస్తారు. డివిజనల్ కమిటీ సభ్యులు అయితే రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులు అయితే రూ.4 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా లొంగిపోయేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తారు.

Leave A Reply

Your email address will not be published.