ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు, హైదరాబాద్ (ఆర్జేడీ) ఎం. సోమిరెడ్డి తెలిపారు. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధన విధానం, ఉపాధ్యాయుల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయి, అవగాహనను తెలుసుకున్నారు.
అలాగే విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, వసతి పరిస్థితులను పరిశీలించి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత ఎస్‌ఓ మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. కేజీబీవీలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
విద్యాసంస్థలకు చెడ్డపేరు రాకుండా సమన్వయంతో పని చేయాలని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సంస్థ ప్రతిష్టను కాపాడాలని తెలిపారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే, కేజీబీవీలను రాష్ట్రంలో ఉత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల ద్వారా బాలికల సమగ్ర అభివృద్ధికి విస్తృతంగా నిధులు కేటాయిస్తున్నదని, అందరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కేజీబీవీలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన సమగ్ర విచారణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిసిడిఓ శోభారాణి, కేజీబీవీ ఎస్‌ఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.