Take a fresh look at your lifestyle.

జూరాలకు పోటెత్తిన వరద

  • 12 ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దాంతో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ ప్రాజెక్టులోకి 1.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిందని అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన జూరాల ప్రాజెక్టు అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా 1,16,424 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 25,785 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇతర డిమాండ్లను కలుపుకుని మొత్తం 1,43,656 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తోంది. (భీమా లిఫ్ట్-I కు 650 క్యూసెక్కులు, కొయిలసాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వ (LMC) ద్వారా 150 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 290 క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు సామర్థ్యం) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.300 మీటర్లు వద్ద ఉంది. మొత్తం నీటినిల్వ 7.279 టీఎంసీలు కాగా, ఇందులో 3.572 టీఎంసీలు జీవ నీటిగా (లైవ్ స్టోరేజ్) ఉంది. ఇదీలావుంటే ఇటీవల డ్యామ్‌కు సంబంధించిన 9వ గేట్ రోప్ తెగిపోయిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. మరో రెండు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటంతో ఆయకట్టు రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అధికారులు స్పందిస్తూ.. ఎలాంటి ప్రమాదం లేదని, అవసరమైన ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోప్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టినట్లు వెల్లడించారు.ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పర్యవేక్షణను కఠినంగా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు దిగువన నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.