- ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ.
- మేకిన్ ఇండియా’ కాదు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ.
- ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం.
- ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు.
- ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కేంద్రంగా ప్రత్యేక జోన్లు.
- జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి పెరిగేలా. చర్యలు.
- ‘ఐఐటీఈఎక్స్ – 2025’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ నినాదం ‘మేకిన్ ఇండియా’ కాదన్నారు. ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ నినాదంతో ముందుకువెళ్తున్నామని చెప్పారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ‘ది ఫెడరేషన్ ఆప్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ర్టియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్ పో(ఐఐటీఈఎక్స్)–2025’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుడూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్(ఐఐపీ) కంపౌండ్ మంత్లీ గ్రోత్ రేటు(సీఎంజీఆర్) 2.9 శాతం అన్నారు.అదే జాతీయ సగటు 0.52 శాతం మాత్రమే అని చెప్పారు.ఈ లెక్కన తెలంగాణలో ఆరు రేట్లు అధికంగా నమోదయ్యిందని వెల్లడించారు. 2024-25లో ఇండస్ట్రియల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్(జీఎస్ వీఏ) రూ.2.77 లక్షలకు చేరిందన్న శ్రీధర్ బాబు.. ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పే రోల్ ఎన్ రోల్ మెంట్స్ లో 13.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని వివరించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతోందన్నారు.అది చూసి ఓర్వలేకపోతోన్న కొందరు ప్రభుత్వ పాలనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.40వేల కోట్ల పెట్టుబడులొచ్చాయనీ కొత్తగా 150 కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయని వివరించారు. 51వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల టెక్నాలజీ, సర్వీసెస్ జోన్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మ్యానుఫాక్చరింగ్ జోన్, ఆర్ఆర్ఆర్ బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నోవేషన్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు తరాల కోసం.ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి చెప్పారు. ఐదేళ్ల కోసం మా ఆలోచన లేదన్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన టోనీ బ్లెయిర్ ఇన్సిట్యూట్ కు కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో కలిసొచ్చే వారందర్నీ కలుపుకుని ముందుకెళ్తామని చెప్పారు.
- జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి పెరిగేలా..
‘దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల బలోపేతంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.గత 18 నెలల్లో కొత్తగా 15వేల ఎంఎస్ఎంఈలు ప్రారంభించినట్లు చెప్పారు. మన జీఎస్డీపీలో ఎంఎస్ ఎంఈల వాటాను 10 శాతానికి పెంచేలానే సంకల్పంతో గతేడాది ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేశామన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేకంగా ఎంఎస్ ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వీటిల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ టీసీసీఐ అధ్యక్షుడు డా.సురేష్ కుమార్ సింఘాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్. రవి కుమార్, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్ 2025 కన్వీనర్ విమలేష్ గుప్తా పాల్గొన్నారు.