నగరంలోట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ నిర్ణయం
ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఏర్పాటు
తాజాగా రాయదుర్గ్-టీ హబ్ వద్ద కొత్త స్కైవాక్ కు ప్రతిపాదనలు సిద్ధం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ లో రద్దీగా ఉండే కీలక ప్రాంతాల్లో మరిన్ని స్కైవాక్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విశాలమైన రోడ్లు దాటలేక ఇబ్బంది పడేవారికి.. ట్రాఫిక్ ఉన్న సమయంలో.. పాదచారులు ఈ స్కైవాక్‌లను ఉపయోగించి.. సులువుగా గమ్యాన్ని చేరుకునేలా మార్గం సుగమం చేస్తున్నది. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్కైవాక్‌లపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్‌లోని రాయదుర్గ్-టీ హబ్ వద్ద కొత్త స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల భద్రత, మరింత సౌకర్యంగా నడిచి వెళ్లడం కోసం ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి పోలీస్, ట్రాఫిక్ ఉన్నతాధికారులతో ఈ నెల 2న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్.. క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు. ఈ స్కైవాక్.. రాయదుర్గ్ నుంచి ప్రారంభమై మెట్రో స్టేషన్, ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ జంక్షన్ మీదుగా టీ-హబ్ వరకు నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, నగరవాసులతో కిక్కిరిసిపోయి ఉండే ట్రాఫిక్, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ స్కైవాక్ ప్రాజెక్టును అధికారులు ప్రతిపాదించారు. ఈ స్కైవాక్ నిర్మాణంతో దాదాపు 30 శాతం ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని అధికారులు ప్రణాళికలు వేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాయంతో ఈ స్కైవాక్ ప్రతిపాదనను అధికారులు రూపొందించారు. ఈ స్కైవాక్ ఫేజ్-1లో భాగంగా 500 మీటర్ల మేర నిర్మించనున్నారు. ఇక టీ-హబ్, మైండ్ స్పేస్ సీ-గేట్‌ను కలుపుతూ 400 మీటర్ల అండర్‌పాస్ నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో రోజురోజుకూ జనాభా భారీగా పెరిగిపోతోంది. ఐటీ కారిడార్‌లో నిత్యం లక్షల మంది టెకీలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ఆ మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ పనులను ఎప్పటికప్పుడు చేపడుతూనే ఉంది. అయినప్పటికీ జనం, వాహనాల రద్దీతో.. నగరంలో జనం ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదే సమయంలో ట్రాఫిక్ సమయంలో పాదచారులు నడిచేందుకు, రోడ్డు దాటేందుకు కూడా చాలా కష్టంగా మారుతోంది. ప్రజలకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలగాలంటే స్కై వాక్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేస్తోంది.