- మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే.
- స్థానిక సంస్థల్లో పొత్తులుండవు.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోనూ, దేశంలోనూ భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్సేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడారు.. దేశంలో కుటుంబ, అవినీతి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఎవరితో పొత్తలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం అందజేస్తున్న నిధుల గురించి ప్రజల్లో వివరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అర్హుడని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలంటే కనీసం రెండుసార్లు పార్టీ క్రీయాశీలక సభ్యుడు అయ్యి ఉండాలనే నిబంధన ఎంపీ ఈటలకు వర్తించదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయాలన్నీ డైనింగ్ టేబుల్ మీద జరుగుతాయని ఆయన విమర్శించించారు. ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని పధకాలను ప్రవేశపెట్లాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందన్నారు.హైదరాబాద్ మెట్రో తర్వాత ఫేజ్‌కి కేంద్రం సహకారం అందజేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి ఎంఐఎం పార్టీ పనిచేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతో బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఎవరైనా సినీ ప్రముఖులు బీజేపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు.