Take a fresh look at your lifestyle.

సర్కారు బడికి మహార్దశ

  • ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలు.
  • ఉచితంగా అత్యాధునిక సాంకేతిక బోధన.
  • ప్రముఖ ఎన్​జీవో సంస్థలతో విద్యాశాఖ కీలక ఒప్పందం.
  • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంవోయూ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విద్యా నాణ్యత ప్రమాణాల పెంపుతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్న పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలు ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతున్నది. త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలు కల్పించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఆదివారం ఎంవోయూ కుదుర్చుకున్నది. పాఠశాల విద్యాశాఖ విన్నపం మేరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్ ​ను ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ వాలా ఇంటర్​ విద్యార్థులకు నీట్​, జేఈఈ, క్లాట్​ పరీక్షలకు సన్నద్ధం చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్​ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణ అందజేయనుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్​ సెకండియర్​ వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చింది. పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణ అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ హరిత, ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డా.సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సిఈవో గాయత్రి నాయిర్ లోబో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.