- ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
- విపక్షాల వాదన వినేందుకు కొత్త వేదికలు కావాలి.
- దేశంలో మహిళలు అణిచివేతకు గురవుతున్నారు.
- రాజకీయాల్లో కొత్త నాయకత్వం అవసరం.
- భారత్ సమ్మిట్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : విపక్ష పార్టీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.చాలా దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు చేపడుతున్నాయని ఆరోపించారు.ఏ చట్ట సభలోనూ విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.విపక్షాలు తమ వాదన వినేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారత్ సమ్మిట్ సదస్సు శనివారం ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల క్రితం నాటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు.ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో యువ నాయకత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే కొనసాగుతోందన్నారు.అలాగే దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడా సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటున్నారని చెప్పారు.నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు.విద్వేశ రాజకీయాలు చేయకుండా..ప్రజలకు ప్రేమను పంచాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రతో తాను దేశం మొత్తం పర్యటించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అన్నారు. దేశ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని తెలిపారు.కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్ర పాదయాత్ర మొదలుపెట్టానన్నారు.ఈ యాత్రలో మొత్తం 4వేల కిలోమీటర్లు నడిచానన్నారు.పది రోజుల తర్వాత చూస్తే తనతో పాటు నడిచే వారి సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయిందన్నారు.అయితే ఈ యాత్రలో తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని రాహుల్ వెల్లడించారు. ప్రజలతో ఎలా మాట్లాడాలి..వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నానని చెప్పారు. తాను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదన్నారు. కానీ యాత్రలో తాను ప్రజలపై ప్రేమను వ్యక్త పరచగలిగానని వివరించారు.
