- నిర్మాణంలో సరైన చర్యలు తీసుకోలేదా
- టెండర్ల వ్యవహారం అసమగ్రంగా ఉందని ప్రభుత్వాన్ని ఎందుకు అడుగలేదు
- ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం జరిగేది కాదు
- అన్నారం బ్యారేజీ నిర్మించిన అఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్
- బ్యారేజీ ప్రతిపాదిత లోకేషన్ మార్చినట్లు చెప్పిన కంపెనీ ప్రతినిధులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా శనివారం అన్నారం బ్యారేజీని నిర్మించిన అఫ్కాన్స్ సంస్థను.. పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు వచ్చాయని, ఇది ఎవరి నిర్లక్ష్యమంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించేముందు అన్ని అంశాలను పూర్తిస్థాయిలో సరి చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై ఉంటుందని పీసీ ఘోష్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థలకు కనీస బాధ్యతలు లేవా అంటూ ప్రశ్నించారు. టెండర్ల వ్యవహారం అసమగ్రంగా ఉంటే.. అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు అడుగలేదని నిలదీశారు. కనీసం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్థాయిలోనష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అన్నారం బ్యారేజీని నిర్మించిన అఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులు నాగ మల్లికార్జున రావు, శేఖర్ దాస్లు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. గతంలో వారు చేసిన అఫడవిట్లు ఆధారంగా వారిని ప్రశ్నించారు. పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, నిబంధనలు, డిజైన్లు, పనుల ప్రారంభం, మధ్యలో పనుల ఆలస్యానికి కారణాలను, ముందు నుంచి తలెత్తిన సమస్యలు, తీసుకున్న జాగ్రత్తలపై ప్రశ్నించారు.
లోకేషన్ మార్చారు…
ఈ సందర్భంగా అఫ్కాన్స్ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్కు పలు వివరాలను వెల్లడించారు. బ్యారేజీ ప్రతిపాదిత లోకేషన్ మార్చారని, అంతేకాకుండా భూమిని అప్పగించడంలో చాలా ఆలస్యం చేశారని వివరించారు. దీంతో పనులు ప్రారంభించేందుకే కొంత అదనపు సమయం పట్టిందని, సైట్కు వెళ్లేందుకు మార్గం కూడా లేకపోవడంతో దాదాపు ఏడాదిన్నర కాలానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములను లీజుకు తీసుకున్నామని వివరించారు. నిర్మాణ సమయంలో కూడా సమస్యలు తలెత్తాయని, వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లినా సరైన సమయంలో స్పందించలేదన్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రాజెక్టుల పనులు చేసే సమయంలో అన్ని అంశాలను ముందుగానే.. పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలకు ఉంటుందని, కేవలం కాంట్రాక్ట్, డబ్బులు వస్తున్నాయని మాత్రమే చూసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. అయితే, ఈపీసీ ఒప్పందం చేస్తే సర్వే సహా అన్ని అంశాలను తామే చూసుకుంటామని, కానీ, ప్రభుత్వం అలా అప్పగించలేదని అఫ్కాన్స్ ప్రతినిదులు చెప్పారు.
సమస్యలు వస్తున్నప్పుడే ప్రాజెక్టు పనుల విషయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపామని, ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీ తరహా ప్రొటెక్షన్ వర్క్స్ గురించి చర్చించామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు.. కమిషన్ ముందు వెల్లడించారు. సీసీ బ్లాకులు దెబ్బతిన్న తర్వాత కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించామని, అందులో పొరపాట్లు తేలడంతో సమగ్రంగా నీటి పారుదల శాఖకు సిఫారసు చేశామని, కానీ, శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. అన్నారం బ్యారేజ్ ఆనకట్టకు ఎలాంటి పగుళ్లు రాలేదని, ఒకసారి సీపేజీ సమస్యలు వస్తే వెంటనే గ్రౌటింగ్ చేసి అరికట్టామని అఫ్కాన్స్ ప్రతినిధులు తెలిపారు. దీంతో పీసీ ఘోష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిందని, ప్రభుత్వానికి చెప్పిన నిర్లక్ష్యం ఎందుకు వహించారని ప్రశ్నించారు. తాము ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పామని, లోకేషన్ మార్పు ప్రధాన కారణమని, 2017, 2018 వరదలతో ఎలాంటి ఇబ్బంది లేదని, 2019 నవంబర్లో జరిగిన వరదల సందర్భంగా సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధులు.. కమిషన్ ముందు చెప్పారు.