Take a fresh look at your lifestyle.

సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
విద్యార్థులు సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సూచించారు. మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆయన తెలిపారు.

శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశాయి.

ఈ సందర్భంగా వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఎమ్మెల్సీ అభినందించి, వారి భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు RTF చెక్కులను పంపిణీ చేశారు.

99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారని గుర్తుంచుకొని జీవితంలో విజయం సాధించి వారిని గర్వపడేలా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు, ఎంప్లాయ్‌మెంట్ అధికారి రాఘవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలి, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రామనారావు, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్ రాజేశ్వరి, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.