కీలక ఖనిజరంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలి
కీలక ఖనిజ రంగ అభివృద్ధికి తన వంతుగా సింగరేణి కృషి
హైదరాబాద్ లో నీతి ఆయోగ్ కీలక ఖనిజ కమిటీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఖనిజ రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి దేశంగా రూపుదిద్దడానికి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ అభిప్రాయపడింది. దేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత, కీలక ఖనిజాల అన్వేషణ, అందుకు ఉన్న అవకాశాలు, వివిధ ప్రభుత్వ మైనింగ్ సంస్థలు తీసుకోవలసిన చొరవ, బాధ్యతలు ఇతర అంశాలపై లోతుగా చర్చించింది. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో గురువారం కమిటీ భేటీ అయింది. కమిటీ ఛైర్మన్ డాక్టర్ డీకే. సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ మెంబర్ సెక్రటరీ, నీతి ఆయోగ్, డిప్యూటీ అడ్వైజర్ మినరల్స్ ఆర్. శరవణభవన్, సభ్యులుగా ఉన్న సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడారు. దేశంలో ఉన్న ప్రాథమిక, ద్వితీయ కీలక ఖనిజ వనరులను కనుగొనడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ దేశ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో తమ వంతు కృషి చేస్తుందని దీనికి సింగరేణి సంస్థ తన సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ మట్టిలో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్ లలో దాగి ఉన్న క్రిటికల్ మినరల్స్ ను వెలికితీయడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. జాతీయ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో సింగరేణి సంస్థ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్తు, బ్యాటరీలతో నడిచే వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగ విస్తరణ లో, రక్షణ రంగంలో కీలక ఖనిజాల అవసరం ఎంతో ఉందన్నారు. దేశంలో కీలక ఖనిజాల వనరులు ఉన్నప్పటికీ, వాటి మైనింగ్ జరగటం లేదని కాబట్టి ప్రస్తుతం విదేశాల నుండి కీలక ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని కమిటీ అభిప్రాయసడ్డారు. రానున్న కాలంలో కీలక ఖనిజాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే దేశంలో ఉన్న కీలక ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ మైనింగ్ సంస్థలు, ప్రైవేటు మైనింగ్ సంస్థలు కలిసి నడవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి.శ్రీనివాస్, జీఎం(ఎక్స్ప్లోరేషన్) బి.శ్రీనివాసరావు, ఐఎంఎంటీ, కోల్ ఇండియా, సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐ (కరైకుడి), గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, అదానీ, వేదాంత, లాయిడ్ మెటల్స్, హిందాల్కో, హిందుస్తాన్ జింక్, సన్ టెక్నాలజీస్ (చెన్నై) తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.