Take a fresh look at your lifestyle.

​కూకట్‌పల్లిలో కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ: 24 గంటల్లోనే ముఠా అరెస్ట్

​ముద్ర కూకట్‌పల్లి :

నగరంలోని కూకట్‌పల్లిలో కలకలం రేపిన కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ ఖుస్రోద్దీన్ (A4) సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 77.78 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు మరియు ఒక హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు.
​పథకం ప్రకారం దోపిడీ..


​పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఖుస్రోద్దీన్ ‘సిద్రా ఎంటర్‌ప్రైజెస్’లో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తూ, యజమాని సూచన మేరకు హవాలా నగదును సేకరిస్తుంటాడు. యజమాని చేసేవన్నీ అక్రమ లావాదేవీలని, ఆ డబ్బును కొట్టేసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి, తన స్నేహితుడు ఒమర్ షరీఫ్ (A1)తో కలిసి దోపిడీకి స్కెచ్ వేశాడు. మార్చి 17న కూకట్‌పల్లిలో కోటి రూపాయలు తీసుకుని బాధితులు వస్తుండగా, నిందితులు వారి కళ్లలో మిరపపొడి చల్లి నగదుతో పరారయ్యారు.
​దోపిడీ తర్వాత నిందితులు విమానంలో లక్నోకు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, సంఘటనా స్థలంలో నిందితులు వదిలేసిన బైక్ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు శంషాబాద్ విమానాశ్రయంలో ఉండగా, కూకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.
​అరెస్టయిన వారు మహ్మద్ ఒమర్ షరీఫ్ (A1), మహ్మద్ గౌస్ సద్దాం (A2), అబ్దుల్ హమీద్ (A3), మరియు మహ్మద్ ఖుస్రోద్దీన్ (A4).
​ప్రస్తుతం చోటు, సల్మాన్, గౌస్ వంటి మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.