ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణాకు ఐకాన్
నిధులు మంజూరు చేయడం అభినందనీయం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్ గా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లతో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ప్రఖ్యాత విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉండడం మనకెంతో గర్వకారణమని చెప్పారు. అంతటి పేరెన్నికగన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గురువారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో ఆయన నిర్మాణ్-26 సాంకేతిక సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1917 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు.అందుకు కొనసాగింపుగా 1929 లో విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రారంభం అయిన ఇంజినీరింగ్ కళాశాల యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన కళాశాలలలో ఆరవ స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. అంతటి ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం అభివృద్ధికీ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా రూ. వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి… దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి విశ్వవిద్యాలయంలో అవసరమైన అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇక్కడి నుండి ఎంతో మేధో సంపద ఉత్పత్తి అయిందని ఆ మేధస్సు ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న మెజారిటీ ఇంజినీర్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే ఎదిగిన వారు అన్నారు. గల్లీ నుండి డిల్లో స్థాయికి ఎదిగిన నేతలు,క్రీడాకారులు,ఉన్నత పదవులు చేపట్టిన వారి అడుగులు ఇక్కడి నుండే మొదలు అయ్యాయని ఆయన చెప్పారు. అలాంటి విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలుచోవడమే కాకుండా విద్యార్థులు చేసిన త్యాగాలు ఇక్కడ ప్రస్తావనర్హమే అని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కుడా భాగస్వామ్యం కావాలని ఆయన ఉద్బోధించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీరింగ్ విభాగం ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన చెప్పారు. నిజాం సాగర్,నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు ఎస్.ఎల్.బి.సి,దేవాదుల వంటి ఆధునిక ప్రాజెక్టులు ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతున్నాయన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగము విద్యార్థులకు ప్రాక్టికల్స్ పాఠాలుగా ఉపయోగ పడుతాయని ఆయన చెప్పారు.
భవిష్యత్ లో స్థిరమైన అభివృద్ధి,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం,జలవనరుల సమగ్ర నిర్వహణ తో పాటు చెక్ డ్యామ్ ల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంజినీర్లు ప్రాజెక్టుల నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాకుండా వాటి భద్రత,నిర్వహణ బాద్యతలు కుడా ఇంజినీర్లకు ఉంటాయన్నారు. నిర్మాణ్-26 వంటి సాంకేతిక సదస్సులు విద్యార్థులకు పరిశోధన,సృజనాత్మక తాను పెంపొందించే వేడికలని ఆయన చెప్పారు. మన నిర్మాణాలు కేవలము కట్టడాలకే పరిమితము కాకుండా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు దోహద పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్బోధించారు.