కమర్షియల్ సిలిండర్ల కొరతపై సమీక్ష – ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే ఏజెన్సీలను రద్దు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలిసిందని అన్నారు. నేడు గ్యాస్ ఏజెన్సీలతో సమావేశమై రాష్ట్రంలో గ్యాస్ డిమాండ్, సప్లైపై ఆరా తీస్తామని చెప్పారు. గ్యాస్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు ఏజెన్సీలతో జరగనున్న సమావేశంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూసుతామని తెలిపారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్, చమురుకు తీవ్ర కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో హోటళ్లు, హాస్టల్స్, మెస్‌లకు అవసరమైన మేర కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా ప్రాంతాల్లో అవి మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
గ్యాస్ బుకింగ్ గడువు పెంపు..
ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది. ఇప్పటికే పట్టణాల్లో సిలిండర్‌కు, సిలిండర్‌కు మధ్య కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచగా… తాజాగా గ్రామాల్లోనూ ఈ నిబంధనలు విధించింది. గ్రామాల్లో కూడా సిలిండర్‌కు, సిలిండర్‌కు మధ్య కనీస గడువును 25 రోజుల నుండి 45 రోజులకు పెంచింది. ఈ కొత్త నిబంధన, అక్రమ నిల్వలను అరికట్టేందుకు, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అమలులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి రావడంతో వినియోగదారులు అదనపు భారం భరించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.965గా ఉంది. ఇతర నగరాల్లో కూడా ధరలు ఇదే విధంగా పెరిగాయి.