Take a fresh look at your lifestyle.

నాణ్యమైన విద్య అందిస్తే సంక్షేమ పథకాలతో పని లేదు సీఎం రేవంత్ రెడ్డి

 అదే ఆలోచనతో విద్యా విధానం లో మార్పులు తెస్తున్నాం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 తరగతి విధానం
వచ్చే ఏడాది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
అల్పాహారం, భోజనం, రవాణా సదుపాయం కల్పిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది మహిళల హెల్త్ డేటా నమోదు
మహిళలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
విద్యను సక్రమంగా అందిస్తే పేదలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చదువే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని కోకాపేట్ లో మెడికవర్ హాస్పిటల్ ను ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య ను అందిచాలన్న ఆలోచనతో విద్యా విధానం లో మార్పులు తెస్తున్నట్లు సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 తరగతి విధానం తీసుకువస్తామని ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం తో పాటు రవాణా సదుపాయం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితం గా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఏ ప్రాంతమైనా అక్కడి మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది హెల్త్ డేటాను తయారు చేస్తున్నట్లు వివరించారు. 20 ఏళ్ల ఆరోగ్య శ్రీ డేటా ను ఉపయోగించి డేటా తయారు చేస్తున్నామన్న సీఎం త్వరలోనే మహిళలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు.  ప్రజా ప్రభుత్వం క్యాన్సర్ పై ప్రధాన దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ అంశంపై అధ్యయనం, లక్ష్యాసాధన కోసమే ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ ను సలహా దారుడిగా నియమించినట్లు సీఎం తెలిపారు.
నిరుపేదలకు వరంగా మారిన ఆరోగ్య శ్రీ,, సీఎంఆర్ ఎఫ్ పథకాల కోసం ఇప్పటి వరకు రూ. 1800 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. తాజాగా ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. వైద్యం ఖర్చులు సామాన్యులు భరించలేని విధంగా పెరిగిపోయాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగం లో ఉన్న డాక్టర్ లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరారు. రాష్టంలో కోటి ముప్పై లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నట్లు సీఎం వివరించారు. వైద్యం యాంత్రికం గా ఉండొద్దన్న సీఎం.. మానవత్వం తో కూడిన వైద్య సాయం అందించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు సూచించారు. దేశంలో హైదరాబాద్ నుంచి 40 శాతం ఫార్మా  ఉత్పత్తులు నమోదయ్యాయన్నారు. కరోనా వాక్సిన్ ల్లో మూడు మన జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి కావడం మనకు గర్వ కారణమన్నారు.
దేశంలో..తెలుగు సినిమాదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశ సినిమా అభివృద్ధిలో తెలుగు సినిమాదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. ఇది వినోదంతో పాటు మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేస్తుందన్నారు. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ప్రభుత్వం గొప్ప పరిశ్రమగా భావిస్తోందని సీఎం చెప్పారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని కోకాపేటలో అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రారంభించారు. స్క్రీన్లను పరిశీలించి.. అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ పడుతోందన్నారు. హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌లో షూటింగ్ చేసేస్థాయికి తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కాలేజీ రోజుల్లో తాను చాలా సినిమాలు థియేటర్లలో చూశానని చెప్పారు. లారీల్లో వెళ్లి సినిమాలు చూసి తిరిగొచ్చేవాళ్లమన్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి నాలుగైదు సినిమాలు తీసేవారన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలంతా ఏడాకొకటి, రెండేళ్లకో సినిమా తీస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ చాలా గొప్ప వ్యక్తులను ఇండస్ట్రీకి ఇచ్చిందన్న సీఎం… అల్లు అర్జున్ హాలివుడ్ లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఆయన తన టాలెంట్‌ను దేశంలో ప్రూవ్ చేసుకున్నారని చెప్పారు. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా ఆయన భవిష్యత్ ఉండాలని రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.