Take a fresh look at your lifestyle.

ఏసీబీ నోటీసుల కక్షపూరితం

  • వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు.
  • 18 నెలల పాటు డైవర్షన్ పాలిటిక్స్.
  • మాజీమంత్రి హరీష్ రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఫార్మూలా ఈకార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కే టీ ఆర్ కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కే టీ ఆర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలన లో డైవర్షన్ పాలిటిక్స్ ను అమలు చేస్తూ బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవెర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయని హరీష్ రావు తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని ఆయన ఉద్ఘాటించారు.పెట్టుబడులు కూడా వచ్చాయి.తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కే టీ ఆర్ పై మీ నోటిసుల ప్రతాపం? అని ఆయన ప్రశ్నించారు.2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయరని ఆయన గుర్తు చేశారు. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్ ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్ కి తీసుకొని వచ్చారని హరీష్ రావు కొనియాడారు.ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్‌ లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారని అన్నారు.అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపిందని హరీష్ రావు దుయ్యబట్టారు. అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చిందనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలను కక్షపూరితంగా ఎన్నిరకాలుగా వేధించినా సరే రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను మాత్రం ప్రజల్లో ఎండగట్టి తీరుతామని హరీష్ రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.