- మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర,తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు, అర్హత రెండూ కవితకు లేవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ పార్టీలోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మా పార్టీలో మేమందరం కంఫర్ట్‌గా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను ముందు పరిష్కరించుకోవాలన్నారు. కవితకు దమ్ముంటే ఆమె కేసీఆర్ కు రాసిన లేఖలు ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయటకు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్ నేతలు ఈ తరహా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసంతో ఆర్థిక చేయూత ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని.. ఆ రెండు పార్టీలతో తెలంగాణను ఎప్పటికీ ప్రమాదమే అన్నారు.