- ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్.
- పట్నం, పల్లెల్లో వాట్సాప్ గ్రూపులపై నిఘా.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపుల్లో ఏదైనా షేర్ చేస్తే అరెస్ట్ చేయాలని ఆదేశాలు.
- పట్టణాలు, గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో భారీగా పోలీసుల చేరికలు.
- అడ్మిన్లను అడుక్కుంటున్న పోలీస్ కానిస్టేబుళ్లు.
- మూడు లక్షల గ్రూపుల్లో జాయినింగ్స్ ను లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మొన్న నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ..నిన్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని లగచర్లలో ఫార్మాసిటీ..తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి భూముల వరుస వివాదాలతో ఎదురుదెబ్బలు తిన్న రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు అప్రమత్తమైంది.రాష్ట్రాభివృద్ధి..సంక్షేమ పథకాలతో ప్రజామోదం పొందుతోన్న ప్రజాప్రభుత్వంపై క్షేత్రస్ధాయిలో జరుగుతోన్న కుట్రలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకువెళ్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తోన్న విపక్ష పార్టీ నేతలు..ఇతర రంగాలకు చెందిన ప్రముఖులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.ప్రభుత్వంపై బురద జల్లెందుకు ప్రధాన సాధనంగా ఎంచుకున్న సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాద్యమాల్లో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు వాటి వెనక ఉన్న కుట్రదారులపై శాఖాపర చర్యలు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలో దిగిన పోలీసులు పట్టణాలు, గ్రామాల్లో వాట్పస్ గ్రూపులపై నిఘా పెట్టారు. ఆయా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారంపై దృష్టిసారించారు. పోలీసు ఉన్నతాధికారుల తాజా ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా కనీసం మూడు లక్షల గ్రూపుల్లో జాయినింగ్స్ ను లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు..పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో భారీగా చేరుతున్నారు.వార్డు, గ్రామ పోలీసులు వాట్పప్ గ్రూపుల్లో పోస్టులపై నిశిత పరిశీలన చేస్తున్నారు.అనేక చోట్ల పోలీసులు తమను వాట్సప్ గ్రూపుల్లో జాయిన్ చేయాలని అడ్మిన్లను అభ్యర్ధిస్తున్నారు.పోలీసులు వాట్సప్ గ్రూపుల్లో చేరుతుండడంతో అడ్మిన్లు వాటిలో ఉన్న సభ్యులను అలర్ట్ చేస్తున్నారు.ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టులు పెట్టొద్దంటూ హెచ్చరిస్తున్నారు.ఒకవేళ ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే పోలీసులు తీసుకునే చర్యలకు తాము బాద్యులం కాదని స్పష్టం చేస్తున్నారు.
- అన్నిట్లో అవే ఆందోళనలు
కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి నిరసనలు తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది.లగచర్లలో రైతుల నుంచి సేకరించిన భూముల్లో మొత్తం ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ముందు చెప్పకపోవడం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదమని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.ముందే రైతులకు ప్రభుత్వం విడమర్చి చెప్పి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదన్న చర్చ అప్పట్లో జరిగింది.నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీవో మీద దాడిచేసే దాకా వెళ్లింది.తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే చేదనుభవం ఎదురైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400ఎకరాల భూములకు తోడు అక్కడున్న మరో 1600 ఎకరాల్లో ఎకోపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది.ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తర్వాత ప్రతిపక్షపార్టీలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా వారికి తోడయ్యారు.అభివృద్ధి కోసం అడవుల్ని లేకుండా చేస్తారా అనే ప్రశ్నమొదలైంది.పర్యావరణాన్ని నాశనం చేయవద్దనే వాదన తెరపైకి వచ్చింది.విషయం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్లింది.యూనివర్సిటీలో చెట్లను నరికివేయడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దాంతో ఈ వ్యవహారంపై మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నది.