తెలంగాణలో ఏరోస్పేస్ కార్యకలాపాల విస్తరణ
సి130జె సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహీల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ, నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. రక్షణ రంగంలో ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్ఓ) ఫెసిలిటీతో పాటు ఇతర డిఫెన్స్ హబ్‌గా విస్తరిస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నట్లు టిమ్ రైఫిల్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ దేశంలో సి130జె సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ అవసరాల కోసం దేశంలోని టీఏఎస్ఎల్ లో ఎఫ్-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు టీఏఎస్ఎల్ తో లాక్‌హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సీఎంతో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ భేటీ..:
భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ భేటీలో పరస్పర సహకారం, సుహృద్భావ సంబంధాలపై చర్చించారు. ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హైకమిషనర్ అభిలషించారు. ప్రధానంగా విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.