Take a fresh look at your lifestyle.

ప్రగతి పథంలో పేదల సంక్షేమం ​అభివృద్ధి పనులకు సమప్రాధాన్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

 

ముద్ర, ఖమ్మం :

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతోందన్నారు.

సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ​ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో పేదల చెంతకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నరేండ్ల కాలంలోనే కేవలం బీరోలు గ్రామానికి రూ. 29.92 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇందులో భాగంగా రూ. 2.59 కోట్లతో బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ. 64 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. బంధంపల్లిలో రూ. 5.50 కోట్లతో దమ్మాయిగూడెం నుంచి సోలిపురం రోడ్డు మధ్య నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, కల్వర్టుల నిర్మాణం, చెరువు మరమ్మత్తులు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేశామని వివరించారు. ​ఆకేరు వాగు ముంపునకు గురైన రాకాసితండా బాధితులను మంత్రి పరామర్శించి, వారికి ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ ధర్మకర్తలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.