Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకం

దేశం వరకు వెళ్తుందా..?
సంచలనంగా కుటుంబ ఇన్సూరెన్స్ 
రేవంత్ సర్కారు నిర్ణయంపై చర్చ
మోదీ వరకు ఫైల్..
కేంద్ర పథకంతో కలుస్తారా..?
నిధుల సర్దుబాబు ఎలా..
సీఎం ముందు ఐదు సవాళ్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
“ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్”కు సంబంధించిన పూర్తి విధి విధానాలింకా రూపొందించలేదు. కేంద్ర పథకం పీఎంజేజేబీవై తెలంగాణ స్కీమ్‌ను కలపగలరా అనే ఆలోచనపై ఇప్పటికెలాంటి స్పష్టతా లేదు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ప్రకటన “ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్”. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రకారం, 2026 జూన్ 2 నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పేదలు, మధ్యతరగతి, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందనడం వల్ల ఈ హామీ సాధారణ సంక్షేమ పథకాన్ని మించిన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పథకం కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థికంగా కుంగిపోకుండా రక్షించే సోషల్ సెక్యూరిటీ స్కీం అనొచ్చు.

తెలంగాణ రాష్ట్రమే మొదటిదా..?
ఉపముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు తెలంగాణ యే దేశంలో మొదటిదా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే నాగాలాండ్ ఇప్పటికే సీఎంఎల్ఐఎస్ (CMLIS) పేరుతో 2024 ఆగస్టు 15న ఒక రాష్ట్రవ్యాప్త కుటుంబ-ఆధారిత బీమా మోడల్‌ను ప్రారంభించింది. ఆ పథకంలో కుటుంబ పోషకుడు మరణించినప్పుడు రూ.2 లక్షల జీవిత బీమా కల్పించింది. అయితే లబ్దిదారుల సంఖ్యాపరంగా చూస్తే కేవలం 2.5 లక్షల కుంటుంబాలు మాత్రమే అంటే తెలంగాణ లబ్దిదారుల్లో అవి కేవలం 2.1 శాతం మాత్రమే.. అందువల్ల తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం కాదు కానీ కోటీ పదిహేను లక్షల కుటుంబాలు లక్ష్యంగా ఇంత పెద్ద స్థాయి పథకం మాత్రమే తెలంగాణ మాత్రమే అని చెప్పొచ్చు.
ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)తో పోల్చితే… PMJJBY వ్యక్తిగత జీవిత బీమా పథకం. దానిలో ఏదేని కారణంతో బీమా పొందిన వ్యక్తి మరణిస్తే రూ.2 లక్షల కవరేజ్ ఉంటుంది. అందులో చేరేందుకు 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ఈ పథకం బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా ద్వారా, ప్రతి సంవత్సరం రూ.436 ప్రీమియం మన బ్యాంకు ఖాతా నుంచి ఆటో-డెబిట్ అవుతోంది. అంటే ఇది అందరికీ అందే సార్వత్రిక పథకం కాదు; వ్యక్తిగతంగా నమోదు చేసుకుని పథకంలో చేరితేనే వర్తిస్తుంది. తెలంగాణ ప్రకటించిన పథకం మాత్రం మరింత విస్తృతమైంది. ఇది కుటుంబం ఒక యూనిట్‌గా, రూ.5 లక్షలు బీమా కవరేజీ వర్తిస్తుంది. పైగా ప్రభుత్వం దీన్ని సంక్షేమ హామీగా ప్రకటిస్తోంది, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ తేడా చిన్నది కాదు ఒకరకంగా చెప్పాలంటే ప్రజాసంక్షేమ విధానంలో చాలా పెద్ద ముందడుగు.

నిధులెలా సాధిస్తారు.. కేంద్ర పథకాన్ని కలుపుకుని ఇస్తారా?
“ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్”కు సంబంధించిన పూర్తి విధి విధానాలింకా రూపొందించలేదు. కేంద్ర పథకం PMJJBYతో తెలంగాణ స్కీమ్‌ను కలపగలరా అనే ఆలోచనపై ఇప్పటికెలాంటి స్పష్టతా లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు పరిశీలించొచ్చు. ఒకటి, రాష్ట్రమే సొంతంగా ఒక గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం నడపడం. రెండోది, PMJJBYని ఆసరా చేసుకుని దానికి రాష్ట్రం టాప్-అప్ కవరేజ్ ఇవ్వడం. మూడోది, అర్హులైన వారికి PMJJBY ప్రీమియం రాష్ట్రం చెల్లించి, మిగిలిన వర్గాలకు వేరుగా పథకం అమలుచేయడం. కానీ ఒక సమస్య ఉంది. PMJJBYలో వయో పరిమితి, బ్యాంక్ ఖాతా, consent, annual renewal వంటి షరతులు ఉన్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం “అందరికీ” అనే మాట ఉంది. కాబట్టి రాష్ట్రంపై భారం మాత్రం భారీగానే వుండొచ్చు.

ఇదివరకే ఇలాంటి పథకాలున్నాయా ?
పేదల కోసం, గ్రామీణ భూమి లేని కుటుంబాల కోసం, అసంఘటిత కార్మికుల కోసం, ప్రమాద బీమా అవసరమున్న వర్గాల కోసం గతంలో ఇలాంటి పథకాలు వచ్చాయి. కానీ “ప్రతి కుటుంబానికి జీవిత బీమా” అనే స్థాయిలో, రాష్ట్రం అధికారికంగా పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం మాత్రం తెలంగాణనే మొదటి రాష్ట్రం. అందుకే తెలంగాణ ప్రకటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. పైగా కేవలం పేదలకే పరిమితం కాకుండా మధ్యతరగతి, ఎగువ తరగతుల వారికీ బీమా అందించడం సంక్షేమ పథకాల అమలులో ఓ పెద్ద మలుపు.

ఐదు ప్రధాన సవాళ్లు
మొదటిది కుటుంబ నిర్వచనం- కుటుంబం అంటే ఎవరెవరు?

రెండోది కుటుంబ పోషకుడు (breadwinner)గుర్తింపు- ఒక కుటుంబంలో ఇద్దరు సంపాదిస్తే? మహిళే ప్రధాన ఆదాయ వనరు అయితే?

మూడోది వయస్సు, రిస్క్, ప్రీమియం భారం — వయస్సు పరిమితి లేకుండా పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తే ప్రీమియం ఖర్చు గణనీయంగా పెరగొచ్చు.

నాలుగోది లబ్దిదారుల జాబితా — లబ్ధిదారుల డేటాబేస్ బలంగా లేకపోతే క్లెయిమ్‌ల వద్ద వివాదాలు మొదలవుతాయి.

ఐదోది, అంతకంటే ముఖ్యమైనది క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగం. ఇప్పటికే ఇలాంటి పథకం అమలవుతున్న నాగాలాండ్‌లో ఎదురవుతున్న ప్రధాన సవాలు.

మొత్తానికి పథకం విజయవంతంగా అమలైతే ఆరోగ్యశ్రీ పథకంతో రాజశేఖర్ రెడ్డికి, రైతు భీమా, రైతు బందుతో కేసీఆర్‌కి వచ్చిన మంచి గుర్తింపు రేవంత్ రెడ్డికీ వస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగా తెలుగు రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలవగల స్థాయి ఈ అందరికీ ఉచిత జీవిత బీమా పథకానికుంది. కాబట్టి అవరోధాలు లేకుండా అమలు చేయడంలోనే రేవంత్ సర్కార్ సత్తా నిరూపితమౌతుంది.

Leave A Reply

Your email address will not be published.