Take a fresh look at your lifestyle.

అర్చకుల చిరకాల కోరికను నెరవేర్చిన మంత్రి కొండా సురేఖ

  • అర్చకులు, ఉద్యోగులకు గ్రాట్యూటీ రూ.4 లక్షల నుంచి రూయ8 లక్షలకు పెంపు.
  • అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటు.
  • వారి సేవలకు గుర్తిస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం.
  • అర్చన సంక్షేమ నిధి పోస్టరును రిలీజ్ చేసిన మంత్రి సురేఖ, ఉన్నతాధికారులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర‌వ్యాప్తంగా దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కుల చిర‌కాల కోరిక‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చ‌క‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. సోమ‌వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంటు ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్‌, డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో అర్చ‌క, ఉద్యోగ సంక్షేమ నిధి పోస్ట‌రును విడుదల చేశారు. అనంత‌రం మంత్రి సురేఖ మాట్లాడుతూ అర్చ‌క‌, ఉద్యోగుల కోసం త‌మ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో గల సహాయ కమీషనర్ స్థాయి వరకు గల దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు ల‌బ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరము చెల్లించు గ్రాట్యూటి నిర్ధారించిన‌ట్టు చెప్పారు. మరణానంతరము చెల్లించు ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లింపు ఈ నిధి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.ఈ నిధి కింద ఉద్యోగుల‌కు మెడికల్ రీయింబ‌ర్స్ మెంట్‌, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు. మరమ్మత్తుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. తాము పేర్కొన్న పథకాలలో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి పథకానికి గత మే 28వ తేదీన అర్చక సంక్షేమ బోర్డు వారు గతంలో చెల్లించిన గ్రాట్యుటీ రూ 4 లక్షల నుండి రూ 8 లక్షలకు పెంచిన‌ట్టు చెప్పారు. ఈ గ్రాట్యుటీ మొత్తమును సదరు ఉద్యోగి యొక్క బ్యాంకు ఖాతాలో ఏక మొత్తములో వారి సర్వీసు కాలమునకు లోబడి చెల్లిస్తామ‌న్నారు. ఎవ‌రైనా అకాల మరణం పొందితే అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ20,000/- ల నుండి రూ 30,000/- లకు పెంచిన‌ట్టు చెప్పారు. కాగా, ఈ అంశానికి సంబంధించి ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ది జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.