Take a fresh look at your lifestyle.

నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఆదేశాలు

నిబంధనల మేరకు నామినేషన్ల పరిశీలన
 

ఎలాంటి పొరపాట్లకు తావివొద్దు

మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిత్తల్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి -ఉమ్మడి రంగారెడ్డిజిల్లా): మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మొయినాబాద్ మరియు చేవెళ్ళ మున్సిపాలిటీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. అనంతరం ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్లోవిధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు పూర్తి సహకారం అందించాలని మయాంక్ మిత్తల్ సూచించారు.

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ: జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, సాయంత్రం 5 గంటలకు గేటు మూసివేసి, గేటు లోపల ఉన్న వారికి టోకెన్లు అందజేసి వరుస క్రమంలో నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కొరకు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ దరఖాస్తులు నింపడం, జతపరచవలసిన పత్రాలు, ఇతర వివరాల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. నామినేషన్ దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు హెల్ప్ డెస్క్ వద్ద పరిశీలించుకుని సరైన నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. 31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2వ తేదీన వాటి పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం. 9849906949 ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.