ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని, నాగర్ కర్నూల్ పట్టణం మరియు మండలం, బిజినపల్లి, తాడూర్, తిమ్మాజిపేట, తెల్కపల్లి మండలాలకు చెందిన మొత్తం 229 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎవరైనా పథకాలకు దూరంగా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.