యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: సింగరేణిలో మహిళాఉద్యోగులకు యాజమాన్యం రెస్క్యూ శిక్షణ ప్రారంభించింది. ఈ మేరకు రామగుండం రీజియన్ లోని మైన్స్ రెస్క్యూ శిక్షణా కేంద్రంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెస్క్యూ రీజియన్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ఇచ్చిన ప్రేరణతో మహిళా ఉద్యోగులకు రెస్క్యూ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంద న్నారు. మహిళా రెస్క్యూ మెదటి బ్యాచ్ వారిని సంస్థ ఛైర్మన్ ఇటీవలే హైదరాబాద్ పట్టణానికి పిలిపించి అభినందించి సర్టిఫికెట్లు అందజేశారన్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళా ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో, సకాలంలో స్పందించే నైపుణ్యం కలిగి ఉంటారని, అందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మహిళల వినియోగ సామర్థ్యం అభివృద్ధికి, కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. 11వ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న దృష్ట్యా, మహిళా ఉద్యోగుల నైపుణ్యాలను రెస్క్యూ విభాగంలో వినియోగించడం, ఈ శిక్షణ ద్వారా ఎమర్జెన్సీ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కో నగలిగే నైపుణ్యం పొందుతారన్నారు. రెస్క్యూ సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ మహిళ ఉద్యోగులకు 17 రోజుల పాటు ఇనీషియల్ శిక్షణ, మైనింగ్ థియరీ, గ్యాసెస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎక్సిస్టెన్స్ స్పెషలిజెడ్ ఎక్విప్మెంట్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఇక శిక్షణ పొందుతున్న వారిలో శ్రీరాంపూర్ 1,2, ఏరియాలు, భూపాలపల్లి ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న 9 మంది మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) మహిళా అధికారులు ఉన్నారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెస్క్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, మూర్తి, ట్రైనర్లు కిషన్ రావు, సాజిద్ అలీ, మురళి, శ్రావణ్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
