మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం అసెంబ్లీలో పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందులో భాగంగానే వారి కోసం ప్రత్యేక జాతికి చెందిన చేపల్ని పెంచి మధ్యాహ్నా భోజనంలో అందించనున్నట్లు వెల్లడించారు. ‘మధ్యాహ్న భోజన పథకంలో చేపల కర్రీ అందిస్తాం. ఇప్పటికే కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించాం. విద్యార్థులకు అందించేందుకు తిలాపియా అనే చేప రకాన్ని ప్రత్యేకంగా పెంచుతాం. ఈ చేపలో మధ్యలో వెను ముళ్లు మాత్రమే ఉంటుంది. పిల్లలు తినే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తిలాపియా చేపను ప్రత్యేకంగా పెంచి పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తాం. అన్ని రంగాల్లోనూ తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక కార్యచరణ రూపొందించాం.’ అని వాకిటి శ్రీహరి తెలిపారు.