ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇటీవల హైదరాబాద్ జెఎన్‌ఎఎఫ్‌ఎయు లోని నెహ్రూ గ్యాలరీలో అంజి ఆకొండి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియేటివ్ హార్ట్ స్ట్రోక్ 4 అనే చిత్ర ప్రదర్శనలో మంథని ఆడపడుచు తుమ్మల రజిని తన చిత్ర కళా నైపుణ్యంతో వీక్షకులను అబ్బుర పరిచారు.ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 50 మంది చిత్రకారులు తమ ప్రతిభను కనబరిచారు.వీటిలో తుమ్మల రజిని ‘మథర్ ఆఫ్ నేచర్’ పేరుతో ప్రదర్శించిన చిత్రం పలువురిని ఆకట్టుకుంది.ఈ చిత్రంలో ఉదయం,సాయంత్రం,రాత్రి కి సంబంధించిన ప్రకృతి అందాలను ప్రతిబింబించే విధంగా రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెఎన్‌ఎఎఫ్‌ఎయు వైస్ ఛాన్స్లర్ టీ. గంగాధర్ మాట్లాడుతూ ప్రకృతి తల్లి లాంటిదని,అటువంటి ప్రకృతిని విభిన్న కోణాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఒకే చిత్రంలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.ఇటువంటి చిత్ర కళాకారులు చాలా అరుదు అని రజినిని కొనియాడారు,ఆమె మరింత ముందుకు వెళ్లి వారి కుటుంబానికి, ప్రాంతానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అభినందించి శాలువాతో సత్కరించారు.
