Take a fresh look at your lifestyle.

లష్కర్ బోనాలకు భారీ ఏర్పాట్లు

  • జాతర ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలి.
  • బోనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత.
  • హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్.
  • ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నిర్వహణపై సమీక్ష.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడం బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహకాళి దేవస్థానం లో ఆషాడ జాతర బోనాలు ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని దానికి తగ్గట్టుగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తూ బోనాల జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్ లో వచ్చే నెల 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, 14న రంగం (భవిష్యవాణి)అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల్లో భక్తులు, ప్రజలు లక్షల్లో తరలివస్తారన్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా 13న దేవాలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలని దేవాలయ, పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ సేవా భావం, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రెవిన్యూ దేవాదాయ,పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. 14న అంబారీ ఊరేగింపులో భక్తులు,ప్రజలకు తొక్కిసలాట జరగకుండా పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. బోనాలు నిర్వహించే దేవాలయాల్లో ఎక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ తో పాటు దేశం నలుమూలల నుండి తెలంగాణ బోనాల ఉత్సవాలకు భక్తులు తరలి వస్తారని నిరంతర విద్యుత్, త్రాగునీరు, వాహనాల పార్కింగ్, వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ నియంత్రణ, భారీ కేటింగ్ ఏర్పాట్లు, నిరంతరం నీటి నిల్వలు పరిశీలన, పారిశుద్ధ్య పనులు, మొబైల్ టాయిలెట్స్, సీసీ కెమెరాల నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆయా శాఖల అధికారులను పొన్నం ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే తెలంగాణకు ఒక ప్రత్యేకమన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టితో పని చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు పోలీసు అధికారుల సర్వీసును ఈ జాతరలో ఉపయోగించుకోవాలని అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పణ, ఊరేగింపులో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ, రోడ్డు భవనాలు శాఖ, దేవాదాయశాఖ, రెవిన్యూ శాఖ,జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆరోగ్యశాఖ లతో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు,అడిషనల్ సి పి విక్రం సింగ్ మాన్ అలాగే ఆలయ కమిటీ సభ్యులు తో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఎస్.కామేశ్వర్, ఆదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు, ఆలయ ఈ.ఓ మనోహర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, విద్యుత్ శాఖ ఎస్సీ చక్రపాణి, ఈ ఈ ఆర్ అండ్ బి మనోహర్, డీఎంహెచ్ వో వెంకటి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.