Take a fresh look at your lifestyle.

చకచకా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

  • లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్.
  • రాష్ట్రంలో చురుకుగా ఇండ్ల నిర్మాణాలు. 
  • ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. 
  • ఇప్పటికే 3 లక్షల ఇండ్లు మంజూరు. 
  • 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలిచ్చాం.
  • రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.  ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్లు వివరించారు. వీటిలో 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయనీ వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకుందని అన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గానూ 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్,సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి సూచించారు. తక్షణమే ఆయా జిల్లాలపై  ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని పొంగులేటి చెప్పారు. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడుతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నామని తెలిపారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత రూ. లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత రూ. లక్ష విడుదల చేస్తున్నామని తెలిపారు.ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొండి గోడలతో ఉన్న ఆ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసీ, నిజామాబాద్,కరీంనగర్,మహబూబ్ నగర్,వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.