నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం
ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ
ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి
డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే
ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం
చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది
కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా
అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి
బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు
ముద్ర, కరీంనగర్ :
హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది.
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే… వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు.
అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.