ముద్ర సంగారెడ్డి,మార్చి :
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని,సమయపాలన పాటించాలని,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు అన్నారు. జిల్లాఅధికారులు హాజరుకాకుండా,వారి సహాయకులు హాజరవుతున్న విషయం గమనించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని గ్రివేన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 41 పిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి దూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తారని, వారి సమస్యలను అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే కాకుండా, తగిన పరిష్కార మార్గాలను కూడా చూపించాలని సూచించారు.ప్రజా సమస్యల పై ఆయా శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) మాధురి,నారాయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి,జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఆర్డీఓలు ,వివిధ శాఖల జిల్లా అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.