Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ మైండ్ గేమ్

 

కాంగ్రెస్ వ్యతిరేకవర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం
– పాలమూరు లో ఒక వర్గం కాంగ్రెస్ నేతలపై వల విసురుతున్న బీ ఆర్ ఎస్ నేతలు
– ఇప్పటికే చీలిన కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్న గులాబీ శ్రేణులు
– వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పలువురు కాంగ్రెస్ నేతలను గులాబీ పార్టీ వైపు మళ్ళించే యత్నం
– బీసీ ల సమావేశం లో, రంజాన్ ప్రార్ధనల్లో ఈద్గా వద్ద బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి పక్కనే కూర్చున్న కాంగ్రెస్ ఓ వర్గం నేతలు
– మున్సిపల్ ఎన్నికల తరువాత రెండుగా చీలిన కాంగ్రెస్ పార్టీ
– ఈ అవకాశం వదులుకోవద్దని బీ ఆర్ ఎస్ వ్యూహం..
– ఇప్పటినుంచే మైండ్ గేమ్ మొదలు పెట్టిన మాజీ మంత్రి
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
పాలమూరు రాజకీయ రణరంగం లో బీ ఆర్ ఎస్ పార్టీ ఉనికిని నిలబెట్టుకునేందుకు మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పటికే అ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనదైన స్టైల్ లో ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యే, అందులో ఇదేళ్ల పాటు మంత్రి గా పనిచేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. పాలమూరు లో ఎవ్వరూ చేయనంత అభివృద్ధి చేస్తే ఓటమి తనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆవేదన చెందారు. ఓటమి ని జీర్ణించుకోలేని శ్రీనివాస్ గౌడ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచి బీ ఆర్ ఎస్ ఉనికి ని కాపాడేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందుకోసం బీసీ నినాదాన్ని అధికంగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ కొందరు బీసీ నేతలు మాత్రం ఆయన తీరుపై విమర్శలు చేస్తున్నారు. అధికారం లో ఉన్న సమయం లో నియోజకవర్గం లోని బీసీ లపై అనవసర కేసు లు పెట్టి జైలు కు పంపించిన విషయం మరిచిపోయారా అని కొందరు బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కొందరు బీసీ నేతలు మీడియా సమావేశం లో మాజీ మంత్రి తీరును ఎండగట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ నినాదం ఎత్తుకోవడం చూస్తే ఆయనకు బీసీ లపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అ సంఘము నేతలే ఆరోపణలు చేస్తున్నారు. బీసీ నినాదంతో పాటు కాంగ్రెస్ పార్టీ లో నుంచి ముఖ్య మైన నేతలను బీ ఆర్ ఎస్ వైపు లాగేందుకు సమయం చూస్తూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ఇందుకు దారి చూపినట్లు అయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా మేయర్ పదవి విషయం లో పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. ముందుగానే అనుకున్న విధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య కు మేయర్ గా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుకూలంగా సాంకేతాలు వచ్చాయి. ఈ ఆనంద్ గౌడ్ గతం లో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అనుచరునిగా గుర్తింపు ఉంది. బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ గౌడ్ కు అప్పుడు మంత్రి గా ఉన్న శ్రీనివాస్ గౌడ్ అవకాశం ఇచ్చారు. మూడేళ్ల తరువాత ఇద్దరి మధ్య తగాదాలు రావడం తో ఆనంద్ గౌడ్ బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన తో పలువరు కౌన్సిలర్లు బీ ఆర్ ఎస్ వీడడం శ్రీనివాస్ గౌడ్ కు అవమానం జరిగినట్లు అయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా మండే చందంగా పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ భార్య కు మేయర్ పదవి ఇవ్వకపోవడం తో ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఇదంతా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వల్లే తన భార్య కు మేయర్ పదవి రాలేదని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో యెన్నం కు మద్దతుగా నిలిచి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన తనకే ఇలా మేయర్ పదవి రాకుండా అడ్డుకుంటారా అని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆనంద్ గౌడ్ భార్య కు మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, డీసీసీ మాజీ అధ్యక్షులు ఒబేదుళ్ల కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత పట్టుబట్టారు.ఒబేదుళ్ల కొత్వాల్ కూడా తన కుమారునికి డిప్యూటీ మేయర్ కావాలని పట్టుబట్టారు. ఇదేమి పట్టించుకోని ఎమ్మెల్యే యెన్నం మేయర్ పదవి ముదిరాజ్ ఆడబిడ్డ మమత, డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డి కి పదవులు ఇచ్చారు.దీంతో ఈ నేతలు ఎమ్మెల్యే పై మండిపడుతూ వీరంతా ఒక్కటై ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయారు. కాంగ్రెస్ లో ఇంత తతంగం జరగడం తో బీ ఆర్ ఎస్ కు కలిసివస్తుందని శ్రీనివాస్ గౌడ్ తన హ్యూహం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే యెన్నం కు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నేతలను తన వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారనే సమాచారం అందుతోంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ ఫంక్షన్ హాల్ జరిగిన బీసీ ల సమావేశం లో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇదే సమావేశం లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం చర్చ కు దారితీసింది. స్టేజి పై ఇద్దరు ముచ్చట్లు పెట్టిన తీరుకు అందరూ ఆచర్యపోయారు. ఇక్కడే కాకుండా రంజాన్ పర్వదినం రోజు ఈద్గ వద్ద కూడా ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. సమీపంలో ఎమ్మెల్యే ఉన్నా సంజీవ్ ఆయనను పట్టించుకోకుండా శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడం పలువురు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు. ఇక్కడే ఒబేదుళ్ల కొత్వాల్ కూడా ఎమ్మెల్యే ను పట్టించు కోకుండా శ్రీనివాస్ గౌడ్ తో ముచ్చట్లు పెట్టారు. ఇదంతా అక్కడే ఉన్న కాంగ్రెస్ ఇతర నేతలు వారి తీరునుఎండగడుతున్నారు.వీరితో పాటు లోలోపల ఆనంద్ గౌడ్ కూడా శ్రీనివాస్ గౌడ్ టచ్ లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అవకాశం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో శ్రీనివాస్ గౌడ్ పడ్డారు. ఈ రెండు మూడు సంఘటన లే కాకుండా ఈ చీలిన కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి కి అప్పుడప్పుడు టచ్ లో ఉంటున్నారని ఎమ్మెల్యే వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు ఈ పరిస్థితులు చూస్తే అర్థం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.